- గ్లోబరినా సంస్థతో కుమ్మక్కై 25 మంది స్టూడెంట్స్ మృతికి కేటీఆర్ కారణం
- రెండెకరాల భూమి తప్ప ఇల్లు కూడా లేదన్న కేటీఆర్‌కు..
- 10 ఏండ్ల తర్వాత వెయ్యి ఎకరాల భూములు ఎలా వచ్చినయ్?
- జర్మనీ, జపాన్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి వివేక్ కృషి
- మంచిర్యాలలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ , కాంగ్రెస్ లీడర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: పదేండ్లుగా నిరుద్యోగ యువకులను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని, ఉద్యోగవకాశాలు కల్పించకుండా యువత, విద్యార్థులను రెచ్చగొడ్తూ కేసీఆర్, కేటీఆర్ రాజకీయ లబ్ధి పొందారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. 155 మంది బలిదానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఫ్యామిలీ నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో ఎంపీ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇందారం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శ్రీరాంపూర్ చౌరస్తాలోని సింగరేణి కార్మికుడి విగ్రహానికి పూలమాల వేశారు. మంచిర్యాలలో అంబేద్కర్, కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ..‘ఇంకా యువతను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? ఖబడ్దార్ కేటీఆర్ నీ ఆటలు ఇక తెలంగాణలో సాగవు’ అని హెచ్చరించారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని గ్లోబరినా సంస్థతో కుమ్మక్కై 25 మంది స్టూడెంట్స్ మృతికి కేటీఆర్ కారణం అయ్యాడన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు రెండెకరాల భూమి తప్ప ఇల్లు కూడా లేదన్న కేటీఆర్, పదేండ్ల తర్వాత వెయ్యి ఎకరాల భూములు, వందల ఎకరాల ఫామ్ హౌస్ లు ఎక్కడి నుంచి వచ్చాయో? చెప్పాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, కేసీఆర్, కేటీఆర్ ఈ కామెంట్ చేయించారని ఎంపీ ఫైర్ అయ్యారు. దళితులు నిరసన చేసిన చోట శుద్ధీకరణ చేసి బీఆర్ఎస్ దళిత ద్రోహి అని నిరూపించుకుందన్నారు.
కేటీఆర్ కట్టప్పలా మారి సొంత పార్టీ ఎమ్మెల్యేలను వెన్నుపోటు పొడుస్తున్నారని, హరీశ్‌రావును కింద పడేసిందే కేటీఆర్ అని తెలిపారు. ప్రజా పాలనలో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే సీఎం రేవంత్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాంకామ్ ద్వారా మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని తెలిపారు. రాముడి పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ లాడ్స్ నుంచి రూ.1.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం రూ.50 లక్షలతో రెండు బస్సులను ఇచ్చినట్లు చెప్పారు. జగన్మోహన్రావు సూచన మేరకు మంచిర్యాల అభివృద్దికి మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.-
సింగరేణి కార్మికుల ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తాం
సింగరేణి కార్మికుల ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పలుమార్లు ప్రస్తావించారని చెప్పారు. సింగరేణి కార్మికులకు కాకా ఫ్యామిలీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రావుల ఉప్పలయ్య, సురిమిళ్ల వేణు, గడ్డం శ్రీనివాస్, చీటి సత్యంరావు, ఆకుల రాజేందర్, మంచిర్యాల కార్పోరేటర్లు అగల్‌డ్యూటీ రాణి- రాజు, వేములపల్లి లక్ష్మీదుర్గ, వనపర్తి కేతా రాజేశ్, మేకల రాజు, ఇరుగదిండ్ల రవి, తోటపల్లి రాజేశ్వరి, కౌన్సిలర్లు రాజు, మాజీ కౌన్సిలర్లు సంజీవ్, లీడర్లు సుదమల్ల అశోక్ తేజ, చిప్పకుర్తి జగన్, ఇర్ఫాన్, అజర్ పాల్గొన్నారు.
